కామాంధులపై ఉక్కు పాదం మోపుతున్న ఏపీ సర్కార్.. తగ్గేదేలేదంటున్న హోం మంత్రి అనిత..
రాష్ట్రంలో ఆడపిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి భద్రత కరువవుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు మన దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల, విజయనగరం జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనలపై ఆమె ఈనాడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ రెండు ఘటనలలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని ఆమె మరొకసారి స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, చట్టం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నంద్యాల జిల్లా లోని ముచ్చుమర్రిలో ముగ్గురు మైనర్ల చేతిలో బలైపోయిన బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని హోం మంత్రి ప్రకటించారు. విజయనగరంలో అత్యాచారానికి గురి అయిన 6 నెలల పసిబిడ్డ పేరుపై ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఇకపై ఆడపిల్లలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హోంమంత్రి అనిత హెచ్చరించారు. తాజాగా ముచ్చుమర్రి పీఎస్ పరిధిలోగల ఎల్లాల గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై ముగ్గురు మైనర్ బాలులు అత్యాచారానికి పాల్పడ్డారు. అది చాలదన్నట్టు ఇంట్లో చెబుతుందేమో అన్న భయంతో ఆమెను చంపి మృతదేహాన్ని సమీపంలో ఉన్న చెరువులో పడేశారు. సినిమా స్టోరీ ని తలపించే ఈ సన్నివేశం అందరిని షాక్ కి గురిచేసింది.
గత ఐదు రోజులుగా గాలిస్తున్నప్పటికీ ఆ బిడ్డ మృతదేహం ఇంతవరకు లభ్యం కాలేదు. నిజంగా ఆ చెరువులోనే పడేశారా లేక మరేదైనా చేశారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. నంద్యాల ఘటన మరువకముందే విజయనగరం జిల్లాలో ఉయ్యాలలో నిద్రపోయే ఆరు నెలల పసికందు పై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వరసకు తాతై ఉండి.. ఆ పసి బిడ్డ పై అఘాయిత్యం చేసి పరారయ్యాడు. ఆ బిడ్డ తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల సంరక్షణ కోసం కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇటువంటి విషయంలో అస్సలు తగ్గేదే లేదు అంటున్నారు ఏపీ పోలీసులు.













