దేశం మొత్తం మీద ఆ క్రెడిట్ సీఎం జగన్ కే దక్కుతుంది : హోంమంత్రి సుచరిత
పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం ఏపీలోనే సాధ్యమైందని, సీఎం జగన్ కే ఆ క్రెడిట్ దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. మహిళల భద్రతపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొని మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న పోలీసు భవనాలను పునఃనిర్మించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. పోలీసు స్టేషన్ లకు ఐఎస్ఓ మార్కు అరుదుగా వస్తుందని, నెల్లూరులోని ఒక పోలీస్ స్టేషన్ కు, ఐదు దిశ పోలీస్ స్టేషన్ లకు ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమని సుచరిత అన్నారు.
టెక్నాలజీ పరంగా ఏపీ పోలీసులు ముందున్నాం : డీజీపీ సవాంగ్
టెక్నాలజీ పరంగా ఏపీ పోలీసు విభాగం చాలా ముందున్నదని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నాడు- నేడు కార్యక్రమం మంచి అనుభూతిని ఇస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కింద పోలీస్ స్టేషన్లను ఆధునీకరణ చేయడం సంతోషంగా ఉందని, సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే చేస్తున్నామని ఆయన వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే జరిగాయని, కోవిడ్ సమయంలో కూడా పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని డీజీపీ ప్రశంసించారు.













