ఆ రెండు పార్టీలకు శవ రాజకీయాలు చేయడం అలవాటు
శవ రాజకీయాలు చేయడం ఆ రెండు పార్టీలకు అలవాటు అని హోంమంత్రి చినరాజప్ప వైకాపా, బీజేపీపై మండిపడ్డారు. మోరంపూడి పైవంతెన నిర్మాణ పనులు ఎంపీ మూరళీమోహన్తో కలిసి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కోటయ్య మృతి విషయంలో పోలీసులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిమగ్నమయ్యారని చెప్పారు. రైతు కోటయ్య ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటి పోలీసులపై వారే చంపారని నిందలు వేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. టికెట్లు రానివారే పార్టీ వీడుతున్నారని ఇటీవల వైకాపాలో చేరిన నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వారి స్థానంలో మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.













