కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా? : హోంమంత్రి అనిత
నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. తమకు కక్ష సాధింపు ఉంటే, ఇంతకాలం ఆగుతామా? అని వ్యాఖ్యానించారు. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని, తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించా. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు.
గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డులో రాష్ట్రాన్ని మూడో స్థానంలోకి తెచ్చారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యం ఘటనలు చాలా ఉన్నాయి. ఫిర్యాదులతో ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా మాట్లాడవద్దు. పోలీసులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులకే గత ప్రభుత్వం వినియోగించింది. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలి. కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారు. నాపైనే 23 కేసులు నమోదు చేశారు. అక్రమ కేసులపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తాం. ఏపీలో దిశ చట్టమే లేదు. ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తాం అని తెలిపారు.













