Anitha: ఎవరినీ వదిలే సమస్యే లేదు

గత మూడు నాలుగు రోజుల నుంచి ఏపీ పోలీసులు సంచలనాలు నమోదు చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హోం మంత్రి అనిత(Anitha Vangalapudi) మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు. మా ప్రభుత్వం లో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకెళ్లట్లేదని స్పష్టం చేసారు. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నామన్నారు.
తెలుగుదేశం(TDP) నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా…, గత ప్రభుత్వం లో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. వైసీపీ ప్రభుత్వం లో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మీ లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారని.. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ టీడీపీ ప్రభుత్వం లో పనిచేసిన అధికారులు ఇబ్బంది పడలేదన్నారు.
అక్రమ కేసులతో నాయకులు బలయ్యారే కానీ మా వల్ల అధికారుల అరెస్టు జరగలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తప్పుచేయలేదనటానికి ఇదే నిదర్శనమన్నారు అనిత. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెప్తారన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞాపన మేరకే డోర్ డెలివరీ హత్య కేసులో పునర్ విచారణ జరుగుతోందన్నారు. గత ముఖ్యమంత్రి తో శభాష్ అనిపించుకోవటానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి వారంతా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరించారు.