Anita: మేం అలా చేస్తే మీరు రోడ్డు మీద తిరుగుతారా? : అనిత
మాజీ సీఎం జగన్ (Former CM Jagan) పుట్టిన రోజు సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా తయారైందని వ్యాఖ్యలు చేశారు. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ (YCP)కి ప్రజలు బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. గతంలో గంజాయి హబ్‌గా ఉన్న ఏపీని గంజాయి రహితంగా మార్చేందుకు ఈగల్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయి వద్దని గత ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికైనా జగన్ హాజరయ్యారా అని ప్రశ్నించారు. గంజాయి సాగుని జీరోకు తీసుకువచ్చామని తెలపారు. ఎవరైనా గంజాయి రవాణా చేసినా పట్టుకుని కేసులు పెడుతున్నామన్నారు. రౌడీమూకల ఆటలు కూడా కట్టడి చేస్తామని వెల్లడించారు.వైసీపీ నాయకులు ఎవరిపైనా తాము కక్షలు పెట్టుకోలేదని.. తాము కక్ష సాధింపుకు పాల్పడితే వైసీపీ నాయకులు రోడ్డుపై తిరుగుతారా అని నిలదీశారు. బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని తెలిపారు.






