Hmpv Virus : డేంజర్ బెల్స్ మోగిస్తున్న హెచ్ఎంపీవీ.. ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్న కూటమి..
2025 కొత్త సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే ప్రపంచానికి ఒక ఆందోళనకర వార్త వెలువడింది. అదే హెచ్ఎంపీవీ(Hmpv virus) (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). ఈ వైరస్‌ను “దూకుడుకే బాప్” అని అంటున్నారు, ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో (New virus in China) ఈ వైరస్ విపరీతంగా వ్యాపించి ఆసుపత్రులు అన్ని కేసులతో నిండిపోయాయి. ఈ వ్యాధి ఇప్పుడు జపాన్‌లోనూ విస్తరించగా, భారత్‌లో కూడా కేసులు నమోదు అవుతున్నాయి. బెంగళూరులో (Hmpv case in Banglore) ఇద్దరు చిన్నారులకు, అహ్మదాబాద్ లో ఒకరికి ఈ వైరస్ సోకింది. కేంద్రం ఈ విషయంపై రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ గైడ్‌లైన్స్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క హెచ్ఎంపీవీ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. కానీ ముందస్తు జాగ్రత్తగా, రాష్ట్రానికి కొత్తగా వచ్చే వ్యక్తులపై పూర్తిగా నిఘా పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అనుమానాస్పదంగా కనిపించే వారిపై తక్షణమే పరీక్షలు చేయాలని సూచించారు.
ప్రతి ఆసుపత్రిలో హెచ్ఎంపీవీ కోసం ప్రత్యేకంగా ఇరవై పడకలను కేటాయించారు. అయితే, ప్రజలలో రోగ నిరోధక శక్తి ఉన్నందున, దీని ప్రభావం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
హెచ్ఎంపీవీ లక్షణాలు .. జాగ్రత్తలు..
హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రాంకైటిస్, న్యూమోనియాతో బాధపడుతున్నవారికి ఈ వైరస్ ప్రమాదకరం.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
– బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి.
– ఇంటికి వచ్చిన తర్వాత చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
– ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ వైరస్ కొత్తదేమీ కాదని, 2001లోనే కనుగొన్నారు అని చెప్పారు. ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కుటుంబానికి చెందినదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వైరస్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమైనవి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.












