ఆ మహా దంపతులకు కుమారుడిగా పుట్టడం నా అదృష్టం
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆ మహా దంపతులకు కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి స్తోత్రాన్ని ఏకధాటిగా పఠించారు. హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి తన ఇష్ట దైవమని, ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.













