పాపం పెద్దిరెడ్డి..! సొంతూరికీ వెళ్లలేని పరిస్థితి..!?
ఐదేళ్లపాటు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో జగన్ తో పాటుకొంతమంది నేతలు చక్రం తిప్పారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి.. ఇలా కొంతమంది నేతలు రాష్ట్రంలో అన్నీ తామై వ్యవహరించారు. రాష్ట్రాన్ని వివిధ భాగాలుగా విభజించి వాళ్లకు కట్టబెట్టారు జగన్. అలా రాయలసీమను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దక్కించుకున్నారు. గత ఐదేళ్లూ రాయలసీమలో ఆయనదే ఆధిపత్యం. ఇక ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి చూసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ తమ సొంతూరు పుంగనూరుకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
నెలన్నర క్రితం వరకూ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో రాయలసీమ బాధ్యతలను, ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకున్నారు. ఆ జిల్లాలలను ఆయన తన గుప్పిట్లో పెట్టుకున్నారు. సొంత పార్టీలో తన వ్యతిరేకులను తొక్కేశారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ప్రత్యర్థులను ఎందుకు ఊరుకుంటారు. పూర్తిగా అణచివేశారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పుంగనూరులో టీడీపీ జెండా అనేది కనపడకుండా చేశారు. ఎవరైనా టీడీపీ నినాదాలు చేస్తే వాళ్ల అంతు చూశారు. కేసులు పెట్టి వేధించారు. దీంతో చాలా మంది ఊళ్లు వదిలేసి వెళ్లిపోయారు.
కుప్పం చంద్రబాబు కంచుకోట. అలాగే హిందూపురం కూడా టీడీపీకి పెట్టనికోటలా మారింది. ఆ రెండు నియోజకవర్గాల్లో ఈసారి చంద్రబాబును, బాలకృష్ణను ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం చేశారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనలను అడుగడుగునా అడ్డుకున్నారు. చంద్రబాబును కుప్పంలో అడుగుపెట్టనీయకుండా పలు ఆటంకాలు సృష్టించారు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నేతలను బెదిరించి వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. దీంతో కుప్పంలో ఈసారి గెలవబోతున్నామనే దీమాలో ఉన్నారు. అటు పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు మిథను రెడ్డి చాలా గట్టిగానే ట్రై చేశారు. అయితే సీన్ రివర్స్ అయింది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటులో మిథును రెడ్డి మినహా మిగిలిన చోట్ల ఆ పార్టీ నేతలు ఓడిపోయారు.
ఇప్పుడు పార్టీ కూడా ఓడిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పుంగనూరులో అడుగు పెట్టేందుకు తండ్రీకొడుకులు ఎంత ప్రయత్నిస్తున్నా కుదరట్లేదు. పుంగనూరు వస్తే తరిమికొడతామని వాళ్ల బాధితులు, టీడీపీ శ్రేణులు వార్నింగ్ ఇస్తున్నాయి. గతంలో ఒకసారి పుంగనూరు వెళ్లేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారు. అయితే అక్కడి పరిస్థితి చూసి పోలీసులు వద్దన్నారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక కొడుకు మిథున్ రెడ్డి పుంగనూరులో చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప ఇంటికి వెళ్లారని తెలియగానే అక్కడ ఎలాంటి పరిస్థుతులు నెలకొన్నాయో చూశాం. దీంతో ఒకప్పుడు ఇక్కడ శాసించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు కనీసం పుంగనూరులో అడుగు పెట్టేందుకు కూడా వీలు లేకుండా పోయిందని చెప్పుకుంటున్నారు.













