సీఎం, జగన్ నివాసాల వద్ద భద్రత పెంపు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (23న) జరగనుంది. టీడీపీ, వైకాపాల తరుపున ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు వెంటనే ఆయా పార్టీల అధినేతల ఇళ్లు, కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరు నేతల ఇళ్లు, కార్యాలయాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ఏపీఎస్పీతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీ)కి చెందిన రెండేసీ కంపెనీలు పహరా కాస్తాయి. స్థానిక పోలీసులు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అభ్యర్థులు గెలుపొందిన వెంటనే నేరుగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తరలివస్తే వారందరిని నియంత్రించటం స్థానిక పోలీసులకు కష్టమవుతుందని ఏపీఎస్పీ పోలీసులను భద్రత విధులకు తీసుకున్నారు. ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.













