ఏపీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పోలీసు పరిశీలకుడు కేకే శర్మ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు కోసం రాష్ట్రానికి 90 కంపెనీల పారామిలటరీ బలగాలు వినియోగిస్తున్నట్టు కేకే శర్మ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది సాయుధ బలగాలను మోహరించనున్నారు. 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయుధులైన సీఆర్పీఎఫ్ దళాల పహారా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు సృష్టం చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపింది.













