కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ.. భక్తుల రక్షణే మాకు
భక్తుల ప్రాణ రక్షణే తమకు ముఖ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ కాలినడక దారిలో జంతువులకు ఆహారం పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్ల మార్గంలో చెత్త వేసే దుకాణాల యాజమానులపై చర్యలు ఉంటాయన్నారు. మెట్ల మార్గంలో ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. మెట్లమార్గంలో కంచె (ఫెన్సింగ్) ఏర్పాటుకు టీటీడీ సిద్ధంగా ఉందని, ఈ మేరకు అటవీశాఖకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. అయితే, ఏం చేయాలన్నా అటవీశాఖ ఆంక్షలు కఠినంగా ఉన్నాయని, ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చాక దీనిపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. మెట్ల మార్గంలో వచ్చే భక్తులను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. దారిపొడవునా సూచిక బోర్డులు, లఘుచిత్రాలు ప్రదర్శిస్తామన్నారు. 12 ఏల్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తామని తెలిపారు.













