18 మంది టీటీడీ బోర్డు సభ్యులకు… హైకోర్టు నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 245ను న్యాయవాది అశ్వినీ కుమార్ సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం బోర్డు నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని, రాజకీయ నేపథ్యంలో ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం 18 మంది సభ్యులకు ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని అంగీకరించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది. కాగా 18 మందిని ప్రతివాదులుగా చేర్చడంపై టీటీడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీనిపై మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదులకు ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పాలని వ్యాఖ్యానించింది.













