High Court: మద్యం కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
మద్యం కుంభకోణం కేసులో నిందితులు సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారత సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిలిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB court) సెప్టెంబరు 6న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 26లోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని నిందితులకు తేల్చిచెప్పింది.ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిలును రద్దు చేయాలంటూ సీఐడీ (CID) వేసిన పిటిషన్లను పాక్షికంగా అనుమతించింది. మరోవైపు ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిలు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని నిందితులకు సూచించింది. విచారణ జరిపిన నిర్ణయం ప్రకటించాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.





