Satya Kumar Yadav: ఆ దిశగా సీఎం, డిప్యూటీ సీఎం కృషి : మంత్రి సత్యకుమార్
ఆరోగ్యాంధ్రపదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) అన్నారు. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో సంచార జాతులు నివసించే ప్రాంతాలు, నిర్మాణ స్థలాలు, ఇటుక బట్టీలు, ఇతర వలస ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 1,854 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంధకారమైందని, పిల్లల భవిష్యత్తు నాశనమైందని విమర్శించారు. వైద్య విద్యకు సంబంధించి పీపీపీ (PPP) విధానాన్ని అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని, నీతి ఆయోగ్ ఈ పాలసీని రూపొందించిందని, దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల కొంతమంది ఈ విషయమై హైకోర్టుకు వెళ్లగా కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిందన్నారు. వైసీపీ హయాంలో డబ్బులు ఖర్చుపెట్టకుండా వాటిని దారిమళ్లించి, నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాలేజీలు నిర్మించకుండా నిధులు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఎంతో అనుభవం ఉన్నవారిని ఈ పీపీపీ విధానంలో భాగస్వాములుగా చేస్తున్నామని తెలిపారు.






