వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై మళ్లీ వేటు తప్పదా..!?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అంశాల్లో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఒకటి. ఈ స్థానాన్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున ఇందుకూరి రఘురాజు దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. అయితే గతేడాది ఇందుకూరి రఘురాజు భార్య ఇందుకూరి సుధ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో రఘురాజు కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని భావించింది వైసీపీ అధిష్టానం. వెంటనే శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. ఇందుకూరి రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరింది.
వైసీపీ ఫిర్యాదు మేరకు ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు మోషేన్ రాజు. అయితే శాసన మండలి ఛైర్మన్ తన వాదనను వినిపించుకోకుండా ఏకపక్షంగా తనపై అనర్హత వేటు వేశారంటూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇంతలోనే ఈ స్థానం ఖాళీ అయిందని గెజిట్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నామినేషన్ కూడా స్వీకరించింది. వైసీపీ తరపున శంబంగి చిన అప్పలనాయుడు, టీడీపీ తరపున ఇందుకూరి సుధ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇంతలో రఘురాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు చెప్పింది. శాసన మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆయన అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇందుకూరి రఘురాజు అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరిస్తూ శాసన మండలి ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. దీంతో ఇందుకూరి రఘురాజు మండలికి కూడా హాజరయ్యారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో ఓ నిబంధన ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మారింది. రఘురాజు అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే అతని అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి ఛైర్మన్ ను ఆదేశించింది. అంతవరకూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని శాసన మండలి ఛైర్మన్ మళ్లీ ఆయనపై అనర్హత వేటు వేయొచ్చని భావిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు శాసన మండలి ఛైర్మన్ ఇందుకూరి రఘురాజును పిలిచి మాట్లాడాలి. ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన వాదనతో మండలి ఛైర్మన్ ఏకీభవిస్తే ప్రాబ్లమ్ ఉండదు. కానీ రఘురాజు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. తనపై అనర్హత వేటు వేయడంతో వైసీపీపై ఆయన మరింత ఆగ్రహంతో ఉన్నారు. మండలి ఛైర్మన్ వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో తప్పకుండా ఆయనపై వేటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో రఘురాజు అభిప్రాయాన్ని తీసుకోకుండానే అనర్హత వేటు వేయడంతో హైకోర్టు నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత కూడా వేటు వేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. 2027 మార్చి వరకూ రఘురాజు పదవీకాలం ఉంది. మరి శాసన మండలి ఛైర్మన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.













