జగన్ – షర్మిల మధ్య సెటిల్మెంట్ జరిగిందా..?
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి షర్మిలకు మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలు తారస్థాయికి చేరాయని వాళ్ల మధ్య సఖ్యత తెలియజేస్తోంది. ఇద్దరూ ఇటీవలికాలంలో ఒకే వేదికను పంచుకోలేదు. ఏ కార్యక్రమానికి వెళ్లినా వేర్వేరుగా వెళ్లి వస్తున్నారు. తల్లి విజయమ్మ కూడా వాళ్ల మధ్య గ్యాప్ ను భర్తీ చేయలేక చేతులెత్తేసింది. కుమార్తె షర్మిలతోనే ఆమె ఉంటున్నారు. వై.ఎస్. కుటుంబంలో అన్నాచెల్లెలి మధ్య ఇలాంటి పరిస్థితి చూసి చాలా మంది ఆశ్చ్యర్యపోతున్నారు. మరికొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారు. అయితే జగన్, షర్మిల మధ్య ఇటీవల సంధి కుదిరిందని సమాచారం.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ స్థాపించారు. ఆ వెంటనే జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్న కోసం షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అన్న జైల్లో ఉన్నా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. పార్టీని నిలబెట్టారు. జగన్ జైలు నుంచి బయటికొచ్చారు. 2019లో పార్టీని అధికారంలోకి కూడా తీసుకొచ్చారు. అయితే వైసీపీ ఎదుగుదలలో తన వంతు పాత్ర కూడా ఉందని భావించిన షర్మిల.. రాజకీయంగా ఏదైనా మంచి పదవి వస్తుందని ఆశించారు. అయితే షర్మిలకు జగన్ ఎలాంటి పదవీ ఇవ్వలేదు. తల్లి విజయమ్మ విశాఖలో ఓడిపోతే.. ఆ తర్వాత ఆమెకు కూడా పదవులు కట్టబెట్టలేదు. ఇది కుటుంబంలో ఒకింత విభేదాలకు కారణమైంది.
కేవలం పదవుల విషయంలోనే కాదు.. ఆస్తి పంపకాల్లో కూడా జగన్ – షర్మిల మధ్య గ్యాప్ వచ్చింది. వై.ఎస్. కుటుంబానికి ఏపీ, కర్నాటక, తెలంగాణల్లో ఆస్తులున్నాయి. వీటిని ఇంతవరకూ పంచుకోలేదు. వై.ఎస్. జీవించి ఉన్నంతకాలం కొడుకు, కుమార్తెను ఒకేలా చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే జగన్ కంటే షర్మిల అంటేనే వై.ఎస్.కు ప్రాణం. షర్మిలను విడిచి వైఎస్ ఉండేవారు కాదు. ఈ విషయాన్ని విజయమ్మ తన పుస్తకంలో కూడా వెల్లడించారు. అయితే ఆస్తి పంపకాల విషయంలో జగన్, షర్మిల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. విజయమ్మ జోక్యం చేసుకున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం కాలేదు. దీంతో షర్మిల ఏపీని వదిలేసి తెలంగాణ వచ్చేశారు. ఇక్కడ పార్టీ పెట్టి సత్తా చాటాలనుకుంటున్నారు.
అయితే తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా షర్మిలకు ఆదరణ దక్కలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ షర్మిలను తెలంగాణ కంటే ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇదే విషయాన్ని షర్మిలకు సూచించింది. కానీ ఏపీలో అన్న జగన్ తో విభేదించడం ఇష్టం లేని షర్మిల తాను తెలంగాణకే పరిమితం అవుతానని స్పష్టం చేసింది. అంతేకాక.. అన్నతో ఈ గ్యాప్ ను మరింత తీవ్రం చేసుకోవడం ఇష్టం లేని షర్మిల.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయం కోరింది. మరోవైపు జగన్ కు అత్యంత సన్నిహితుడైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. జగన్ తరపున మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. దీంతో స్టాలిన్, డీకే శివకుమార్ ఇద్దరూ కలిసి జగన్.. షర్మిల మధ్య సఖ్యత కుదిర్చినట్టు సమాచారం. ఆస్తి పంపకాలతో పాటు రాజకీయంగా ఎవరు ఎక్కడ ఉండాలనేదానిపైన కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ కు ఫుల్ స్టాప్ పడిందని సమాచారం. ఈ ఒప్పందం మేరకు ఏపీ, తెలంగాణకు షర్మిల దూరంగా ఉంటారు. మరి ఈ వార్త నిజమో.. కాదో.. మరికొన్ని రోజుల్లో తేలనుంది.













