Harish Kumar Gupta: ఏపీకి ఆయనే కొత్త పోలీస్ బాస్..
ఏపీకి త్వరలోనే కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుతం డీజీపీగా (DGP) ఉన్న ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) పదవీ విరమణ చేయనుండటంతో, ఈ పదవికి ఎవరు వస్తారన్న దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు ముగిసింది. తాజా సమాచారం ప్రకారం, రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను (Harish Kumar Gupta) నియమించనున్నట్లు తెలుస్తోంది.
1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఏపీ డీజీపీగా పని చేసిన అనుభవం కూడా కలిగి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్‌ను డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన బాధ్యతల వల్లనే ఇప్పుడు ఈ పదవికి అతన్ని ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు.
ఇకపోతే, సీనియార్టీ ప్రకారం 1991 బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ఈ పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ, రెండో స్థానంలో ఉన్న హరీష్ కుమార్ గుప్తాను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఆయనకు మంచి అనుభవం ఉండటం, కఠిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేరు ఉండటం వంటి కారణాల వల్లనే ఈ ఎంపిక జరిగిందని అంటున్నారు. మరోవైపు, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని అంటున్నారు. కాగా, హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా నియమించబడిన వార్త త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
ఈ నియామకం తర్వాత కొత్త డీజీపీగా హరీష్ ఏ విధమైన మార్పులు తీసుకురాగలరన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపర్చేందుకు ఆయన తీసుకునే చర్యలు కీలకంగా మారబోతున్నాయి. ఇక, ద్వారకా తిరుమలరావు తన పదవీ కాలంలో తీసుకున్న చర్యలు, ఆయన పనితీరు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో పోలీస్ శాఖలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఈ బాధ్యతలు భారీగా ఉండే అవకాశం ఉంది.













