కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకుంది : జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని విమర్శించారు. రెండు దశాబ్దాలుగా చేసిన అప్పులకంటే వైసీపీ రెండున్నరేళ్ల పాలనలోనే రెట్టింపు అప్పులు చేశారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రూ.25800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో మూడు కారిడార్లు, 5 పారిశ్రామిక నగరాల అభివృద్ధికి 80 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజురు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వాటా నిధులు ఇప్పటికే మంజూరు చేయలేదని విమర్శించారు.
ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటుకు డీపీఆర్లు ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని తప్పుబట్టారు. ఈ ఏడాదిలో రెవెన్యూ లోటు పూడ్చడంలో భాగంగా రూ.11,600 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నా, జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా స్థాయికి తీసుకెళ్లారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.













