డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం
గుంటూరు లోక్‌సభా స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎన్నారై డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయదుందుభి మోగించారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డును కూడా పెమ్మసాని చంద్రశేఖర్ కైవసం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు. అయితే 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైకాపా అభ్యర్థి కిలారి రోశయ్యపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పెమ్మసానికి 60.68 శాతంతో 8,64,948 ఓట్లు రాగా కిలారి రోశయ్యకు 36.5 శాతంతో 5,20,253 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ కిలారి రోశయ్య కంటే పెమ్మసానికి రెట్టింపు ఓట్లు వచ్చాయి.







