CPI: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య

ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య (Gujjula Easwaraiah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ (Ramakrishna) స్థానం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య వ్యవహరిస్తారు. గత 11 సంవత్సరాలుగా ఈ పదవిని నిర్వహిస్తున్న కె. రామకృష్ణ స్థానంలో ఈశ్వరయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య, పలు ప్రజా సమస్యలపై పోరాడి ఇప్పుడు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి వచ్చారు.
విజయవాడలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా (D. Raja) ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. నేడు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో నిర్వహించాం. నూతన రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. రామకృష్ణ దశాబ్దం పాటు కార్యదర్శిగా సేవలు అందించారు. ఎ.ఐ.వై.ఎఫ్ (AIYF) విద్యార్థి విభాగం నుంచి ఈశ్వరయ్య పని చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎన్నో పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ, ఈశ్వరయ్యకు నా అభినందనలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది అని రాజా తెలిపారు.