Gudivada Amarnath: పెట్టుబడుల కంటే అవినీతే ఎక్కువ.. చంద్రబాబు సింగపూర్ పర్యటనపై గుడివాడ ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సింగపూర్ (Singapore) పర్యటన పై ఏపీ రాజకీయాలలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టి నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టూర్ ప్రారంభమైన రోజే చంద్రబాబు భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే (Shilpak Ambule)తో పాటు, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడులకు అనువైన వాతావరణం, అభివృద్ధి అవకాశాల గురించి వివరించారు. అయితే ప్రత్యక్షంగా ఏ కంపెనీ పెట్టుబడిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఇది కేవలం ఊహాగానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఈ పర్యటనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన టైంలో చంద్రబాబు మాత్రం సింగపూర్‌ను మర్చిపోరని ఆయన విమర్శించారు. గతంలోనే ఆయన అవినీతికి సంబంధించిన వ్యవహారాలు సింగపూర్‌దాకా వెళ్లినట్టు చెప్పారు. ముఖ్యంగా యూరో లాటరీ కేసులో నిందితుడు కోలా కృష్ణమోహన్ (Kolla Krishnamohan) ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు పేరుని ప్రస్తావించారని, ఓ అకౌంట్‌కు నగదు బదిలీ చేశానని చెప్పిన సంగతి గుర్తు చేశారు.
గతంలో అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధి విషయంలో సింగపూర్‌తో భాగస్వామ్యాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్ర రైతులను విమానాల్లో సింగపూర్‌కు తీసుకెళ్లినట్టు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. అయితే 2019 ఎన్నికల పరాజయం తర్వాత, ఆయనే కీర్తించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ (S. Iswaran) అవినీతి ఆరోపణలపై విచారణకు గురైనట్టు వ్యాఖ్యానించారు.
సింగపూర్ దేశానికి అవినీతిపై గట్టి చట్టాలు ఉన్నా, అలాంటి ప్రఖ్యాత దేశంలోనే ఉన్న మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఆయనతో చంద్రబాబుకు ఉన్న సన్నిహిత సంబంధాలే చాలా విషయాలు చెబుతున్నాయని గుడివాడ పేర్కొన్నారు. చంద్రబాబు నాలుగుసార్లు సీఎం అయి సింగపూర్ నుంచి ఏపీకి తెచ్చిన పెట్టుబడులు కన్నా, ఆయన వ్యవహారాల వల్ల ఆ దేశంలోనే పెట్టుబడులు పెరిగినట్టు ఎద్దేవా చేశారు. చివరగా, ఈ పర్యటన పెట్టుబడుల కోసం కాదని, గత బంధాలను కొనసాగించేందుకే తీసుకున్న చర్యగా వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీ ప్రజలు ఆశించేది అభివృద్ధి అయితే, చరిత్ర మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.