పార్టీ కోసం పోటీ నుంచి తప్పుకుంటా.. వైరల్ అవుతున్న అమర్నాథ్ స్టేట్మెంట్..
రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం అవసరమైతే పోటీ నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నాడు మంత్రి అమర్నాథ్. అనకాపల్లిలో జరుగుతున్న చేయూత చివరి విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్.. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భారత్ ను నియమించారు అని తెలియపరిచారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ.. చాలామంది నీ పరిస్థితి ఏమిటి ?ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావ్ ?అని అడుగుతున్నారని అమర్నాథ్ అన్నారు. మరో పక్క కొంతమంది తన పని అయిపోయిందని.. అందుకే పార్టీ తనను పక్కన పెట్టేస్తోందని ప్రచారం చేస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. ప్రస్తుతం సీఎం జగన్ తనకు 15 నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారని.. ఈ నియోజకవర్గాలకు డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ గా తాను వ్యవహరిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆ స్థానాలలో వైసిపి నే గెలిపించి తిరిగి జగన్ ను సీఎం చేస్తానని అమర్నాథ్ చెప్పారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే ,తన తలరాత మాత్రం జగన్ రాస్తారు అని అమర్నాథ్ సినిమా రేంజ్ డైలాగ్ కూడా వదిలారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్ వైరల్ అయింది.













