ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: సీఎం
15వ ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. దీన్ని ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోరుతున్నాయని, ఇది ఆర్థికసంఘం పరిధిలోని అంశం కాదని, కేంద్ర ప్రభుత్వమే పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థికసంఘం తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నస్టపోయిందని, తెలంగాణకే ఎక్కువగా ఆదాయం వెళ్లిందని, అందువల్ల తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు.
కేంద్ర బడ్జెట్తో ఎంతో ఆశాజనకంగా ఉన్నా, రాష్ట్రానికి తగిన కేటాయింపులు లేక పోవడం రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సూచనలకు, 15వ ఆర్థికసంఘం నివేదికకు మధ్య వైరుధ్యం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను పరిశీలించి ప్రత్యేకహోదాను ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు.













