ఘనంగా ముగిసిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిసెంబర్ 23,24 తేదీల్లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చి, తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత తీసుకోవలసిందిగా జనబాహుళ్యాన్ని ఏకగ్రీవంగా కోరిన సమాచారం ప్రజలను చేరింది. మనం మాట్లాడే వాడుక భాషే పెనుప్రమాదంలో ఉన్నదని, తెలుగు వాడకంలో ఉంటేనే భాష సజీవంగా ఉంటుందనే గ్రహింపు తెలుగువారిలో కలిగించటానికి ఈ మహాసభలు ఎంతగానో ఉపకరించాయి. తెలుగు పత్రికలు ఈ విషయంలో నిర్వహించిన పాత్ర గణనీయమైనది. సహకరించిన సంపాదకులకు పాత్రికేయులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. యువ రచయితలు, ఉపాధ్యాయులు ఈ సభల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా ప్రతినిధులు తమ గళాన్ని ఘనంగా వినిపించారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర అనే అంశంపై ప్రధానంగా జరిగిన సదస్సులలో వివిధ రంగాలకు చెందిన రచయితలు పెచ్చుమీరుతున్న వాణిజ్య సంస్కృతి పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత గురించి విస్తృతంగా చర్చించారు. మూడు వేదికలపైన సమాంతరంగా 30కి పైగా సదస్సులు, కవిసమ్మేళనాలు, వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
జాతీయ ప్రఖ్యాతి పొందిన యువ అష్టావధానులతో అద్భుతావధానం, 15 మంది కవులతో గజల్స్ ముషాయిరా, కళారత్న కె వి సత్యనారాయణ బృందం నిర్వహించిన ఆముక్తమాల్యద నృత్య రూపకం, నేక్షిత అనే చిన్నారి చేసిన నృత్యప్రదర్శన ఈ మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధుల కోసం, రాష్ట్రేతరాంధ్ర ప్రతినిధులకోసం వేర్వేరు సదస్సులు జరిగాయి. సభలను ప్రారంభించి, భాషోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవలసిన అవసరాన్ని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు నొక్కి చెప్పగా, భారత సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ యన్. వి. రమణ తెలుగు భాషను ఆధునీకరించి, సాంకేతిక ప్రగతితో అనుసంధానం చేయటం ద్వారా తెలుగును ‘ప్రపంచతెలుగు’గా తీర్చిదిద్దాలన్నారు. యువతను అభ్యుదయమార్గాన నడిచేలా మార్గదర్శనం చేయాల్సిన అవసరాన్ని శ్రీ జె. డి. లక్ష్మీనారాయణ నొక్కి చెప్పగా ప్రభుత్వాధినేతలకన్నా రచయితలే ఎక్కువ ప్రభావశీలురని, సమాజాన్ని మేల్కొల్పగలిగేది వారేనని శ్రీ గరికపాటి అన్నారు. ఎన్ని ఇతర భాషలను ప్రోత్సహించినా మాతృభాషకు ప్రాధాన్యత తగ్గకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎ. వి. శేషశాయి అన్నారు. ఈ మహాసభలకు సహకరించిన అందరికీ మండలి బుద్ధప్రసాద్, గుత్తికొండసుబ్బారావు, డా జి వి పూర్ణచందు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను విస్మరించకండి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిద్ధార్థ కళాశాలలోని రాజరాజ నరేంద్ర ప్రాంగణంలో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో మాట్లాడిన వక్తలు తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను విస్మరించకుండా పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిలికానాంధ్ర, సిద్ధార్థ అకాడమీ సంయుక్తంగా ఈ రచయితల మహాసభలు నిర్వహించాయి. గత ఈ సమావేశాలకు డా.మండలి బుద్ధప్రసాద్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ వివిధ వేదికలపై తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల విశిష్టత… వాటికి తిరిగి వైభవం తీసుకురావడంలో రచయితల, కవుల బాధ్యతలను గుర్తుచేస్తూ ప్రసంగించారు. తెలుగు రచయితల మహాసభలో తెలంగాణకు చెందిన పాలమూరు జిల్లా కవులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్ మాట్లాడుతూ… కేవలం మహాసభలు జరపడంతోనే సరిపోదు, విద్యా విధానంలో పాఠశాల స్థాయి నుండి తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఖాజమైనుద్దీన్ మాట్లాడుతూ… తెలుగు భాష ఉన్నతి కోసం మరో ఉద్యమం చేయాలన్నారు.
ఎన్టీఆర్ భాషాభిమానం ఆదర్శనీయం
నందమూరి తారక రామారావు భాషాభిమానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని రంగస్థల, సినీ నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ అన్నారు. 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఎన్టీఆర్ వేదికపై జరిగిన సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారు పేరని, తెలుగు భాషాభిమానుల్లో ముందు వరుసలో ఉంటారన్నారు. సినీ దర్శకుడు, రచయిత వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ.. తెలుగుదనాన్ని తన వేషధారణ, మాటలతో విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు సాంస్కృతిక, భాషా విశిష్టతను వెండితెరపై చూపే అవకాశం తనకు దక్కిందన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… అంతరించిపోతున్న ఆలయ నాట్య వైశిష్టతను వెలికితీస్తున్న తీరును విశదీకరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ఎస్.పి.భారతి మాట్లాడుతూ… స్వభాషను పరిరక్షిం చుకోవడం అంటే మన మనుగడను కాపాడుకోవడమే నన్నారు. భారతి రమేష్, డాక్టర్ పీవీఎన్ కృష్ణ, డాక్టర్ వ్యాకరణం వెంకటరావు, డాక్టర్ రామతీర్థ, తదితరులు పాల్గొని ప్రసంగించారు.
భాషా రక్షణకు సహాయ సహకారాలు అవసరం
తెలుగు భాషను సజీవంగా, మహోజ్వలంగా నిలబెట్టడానికి సహాయ సహకారాలు అందించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ రెండు తెలుగు ప్రభుత్వాలను కోరారు. ప్రభుత్వాలు ఏ భాషనైనా ప్రోత్సహించడాన్ని తప్పుపట్టడం లేదని, మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే మరేదైనా అన్నారు. ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన వారసత్వం, గొప్పతనం, చరిత్ర, పూర్వీకులు రాసిన రచనలు, వారసత్వంగా పంచి పెట్టిన సంస్కృతి సంప్రదాయాలను వదులుకోవడం చారిత్రకంగా, సాంస్కృతికంగా మంచిది కాదన్నారు. తెలుగు భాషకు అమరత్వమే తప్ప మృతత్వం లేదన్నారు. పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఉజ్వలంగా ఉన్నంత కాలం భాషకు క్షీణత లేదన్నారు. తెలుగు క్షీణ దశకు చేరుతుందని అంటుంటే హృదయం ద్రవించి పోతోందని, ఇలాంటి ఆలోచనలను మనసుల్లోకి రానీయవద్దని కోరారు. ఈ భాషకు చావులేదని నమ్మేవారిలో తాను ప్రథముడినన్నారు. ప్రభుత్వ స్థాయిలో తెలుగు భాషకు లభించాల్సిన గౌరవం రావడం లేదేమోనన్న బాధ కలుగుతోందన్నారు.
భాష, శ్వాస మనిషి జీవితానికి కీలకం: వెంకయ్య నాయుడు
భాష, శ్వాస మనిషి జీవితానికి అత్యంత కీలకమైనవని ఈ రెండిరటిలో ఏది ఆగిపోయినా జీవితం ముందుకు సాగదని గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, భాషా పరిరక్షణే ధ్యేయంగా సభలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. రచనల ద్వారానే భాషా సంస్కృతులు ముందు తరాలకు ప్రవహిస్తాయని, రచనలు లేని తరాల ఆలోచనలు ముందుకు సాగవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రా వారి ‘కోటి మాటల కోట’ తెలుగు పదాల ప్రావీణ్య దీపికను ఆవిష్కరించారు. ఈ దీపికను రూపొందించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రసార మాధ్యమాలేవీ లేని సమయంలో ఘంటం ద్వారా తాళపత్రాల మీద రాస్తూ ప్రతులను తయారు చేసే నాటి కవులు నిబద్ధత ఉన్నతమైనదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఈతరం రచయితల్లో అదే స్ఫూర్తి కనిపించాలని ఆకాంక్షించారు. భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావలసిన అవసరం ఉందన్న ఆయన, మన దేశ వైభవాన్ని సాహిత్యమే ప్రతిబింబించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పటిష్టమైన భాషా సంపద, పుష్కలమైన సాహిత్య సంపద ఉన్న తెలుగు ప్రాచీనతను సగర్వంగా చాటుకోవటమే గాక, నవీన పంథాల తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి జరగాల్సి ఉందని ఆకాంక్షించారు.
భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందన్న వెంకయ్యనాయుడు, ఈ ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించటం, పరిపాలనా భాషగా అమ్మభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థానాల కార్యకలాపాల్లో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వటం, ఉన్నత-సాంకేతిక విద్యను అమ్మభాషలో అందించటం, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో మాతృభాషలో మాట్లాడేలా ఐదురకాల చర్యలు అవసరం అని సూచించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పులేదని, కానీ అమ్మభాషలో నైపుణ్యం సాధించటం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.
సమాజంలో వస్తున్న మార్పులు సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, అమ్మభాష అన్నం పెట్టదేమో అనే తల్లిదండ్రుల భయంలో అర్థం లేదని, దీని కారణంగా విలువలు పడిపోతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు రచయితలు మహాసభలను నిర్వహించటం అభినందనీయమన్న ఆయన, సృజనాత్మకతకు, సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసే విధంగా నూతన పంథాల రచనలు రావలసిన అవసరం ఉందని సూచించారు. సమాజ హితమే సాహిత్యం లక్షణం కావాలన్న ఆయన, కవులు, రచయితలు, మేధావులు, విలేకరులు సైతం రాసే ముందు సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా రచనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో పేరుకుపోయిన జాఢ్యాలకు వ్యతిరేకంగా రచయితల కలం కదం తొక్కాల్సిన అవసరం ఉందన్న ఆయన, అవినీతి, అరాచకం, వివక్షలకు వ్యతిరేకంగా రచనలు చేసేందుకు రచయితలు ఉద్యుక్తులు కావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మహాసభ తీర్మానాలివీ…
మహాసభ ముగింపు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి.వి పూర్ణచందు పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. మాతృభాషాభిమానంతో భాషా సంస్కృతుల పరిరక్షకులుగా తెలుగువారంతా భాషను వర్ధిల్లేలా చేయాలని ఈ మహాసభ అభ్యర్థిస్తోందన్నారు. శతక పద్యాలూ, సూక్తులు, జాతీయాలు, సామెతలు నేర్పించడం ద్వారా పిల్లల్లో తెలుగుపై మక్కువ వచ్చే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. తెలుగు వస్తే ఇతర భాషలు, శాస్త్ర సాంకేతిక విషయాలు తేలిగ్గా వంటబడతాయన్న యునెస్కో సూచనను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక ఉపకరణాల్లో తెలుగు వాడకం పెరగాలని, పిల్లల్లో మాతృభాషపై అవగాహన పెరిగే విధంగా పాఠశాలల్లో తెలుగు భాషా సాంస్కృతిక అంశాలను బోధించాలని సూచిం చారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు మాతృ భాషలో బోధించాలని, ఇంటర్, డిగ్రీ స్థాయిలో రెండో భాషగా తెలుగు బోధించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. తెలుగు మాధ్యమంలో చదివినవారికి సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 5శాతం ప్రోత్సాహక మార్కులు ఇచ్చే పద్ధతిని కొనసాగించాలన్నారు. విభజన క్రమంలో భాగంగా చార్రితక ఆధారాల విభజనకు చర్యలు వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రేతాంధ్రుల భాషాపరమైన అవసరాలు తీర్చడానికి ఒక వ్యవస్థను నెలకొల్పాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాల వారికి దక్షిణాది భాషలు నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆ అవకాశాలు కల్పించడం లేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తెలుగు బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితలు సమాయత్తం కావాలని, భాషోద్యమ సైనికులుగా శ్రమించి తెలుగు భాషోద్యమాన్ని ప్రజాపరం చేయాలన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం భాషావేత్తలు, రచయితలు, సాంకేతిక నిపుణులు సమన్వయ వ్యవస్థగా ఏర్పడి ముందుకు సాగాలని తీర్మానించారు.













