ఇళ్ల క్రమబద్ధీకరణకు ఓకే
రాష్ట్రంలోని ఆక్రమిత స్థలాల్లో ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. 2013 బేసిక్ రేటు ఆధారంగా టెలీస్కోపిక్ విధానంలో క్రమబద్ధీకరించనున్నారు. వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ గురువారం సమావేశమైంది. మంత్రిమండలి నిర్ణయాలను మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వివరించారు. అభ్యంతరాలు లేని ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామని, దారిద్య్ర రేఖకు దిగువన, ఎగువనున్న కుటుంబాలకు ఇది వర్తిస్తుందన్నారు. 100 చదరపు గజాల వరకు బిపిఎల్ కుటుంబాలకు ఉచితం. దారిద్య్ర రేఖకు ఎగువనున్న కుటుంబాలకు 100 గజాల వరకు బేసిక్ రేటులో 7.5 శాతం, 205 చదరపు గజాల వరకు 15 శాతం, 500 చదరపు గజాల వరకు 30 శాతం మొత్తాన్ని వసూలు చేస్తారు. 500 గజాలకు మించితే ఆక్రమణలను తొలగిస్తారు.













