అమరావతి రెడీ అవుతోంది…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి రాజధాని పనులు వేగం అందుకున్నాయి. ఆంధ్రుల కలల రూపానికి సాకారమిచ్చేలా ఈ రాజధానిని చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నారు.
అమరావతి నిర్మాణ వ్యయాన్ని 70 వేల కోట్లకు పైగా నిర్ధారించినా.. ప్రస్తుతం 39 వేల కోట్ల రూపాయల విలువైన పనులు సాగుతున్నాయి. తెలుగు ప్రజలు అచ్చెరువు పొందేలా ఆకాశ హర్మ్యాలు రూపుదిద్దు కుంటున్నాయి. రాత్రింబవళ్లు వేల సంఖ్యలో కార్మికులు అక్కడ అహరహం శ్రమిస్తున్నారు. నిర్మాణాలన్ని షేర్వాల్ టెక్నాలజీతో చేస్తున్నారు. ఈ టెక్నాలజీలో ఇటుకలను వినియోగించరు. మరోవైపు పేదలకు ఐదు వేల వరకు నివాసాలు సిద్ధం కావస్తున్నాయి, మొత్తం 61 టవర్లలో 3840 ఫ్లాట్లు సిద్ధం కావాల్సి ఉండగా ఇప్పటికే 1200కు పైగా ఫ్లాట్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ ఫ్లాట్లకు ఇంటీరీయర్ పనులు ప్రారంభం అయ్యాయి.
విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యాసంస్థలు ఇప్పటికే కొలువు దీరాయి. హైకోర్టు భవనం శరవేగంగా నిర్మాణమవుతోంది. జనవరి నెలాఖరు నాటికి హైకోర్టు భవనాన్ని ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. ఆలిండియా సర్వీసు అధికారుల టవర్‌కు సంబంధించిన 12 అంతస్తుల నిర్మాణం 80 రోజుల్లో పూర్తయింది. గజిటెడ్ అధికారులు, ఎన్జీఓలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. ఏపిసిఆర్డీ యే ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులుయే మరో వేపున సాగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సాగుతున్న పనులు చూస్తుంటే అక్కడ ఎంతో కోలాహలం కనిపిస్తుంది. సచివాలయం పరిధిలోని సిఎం టవర్, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేల, అధికారుల గహ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. విద్యుత్ కాంతుల వెలుగులో జరుగుతున్న నిర్మాణ పనులతో ఆయా ప్రాంతాలు మెరిసిపోతున్నాయి.
అమరావతి రాజధాని నగరంలో నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్, హెచ్ఓడి, జీఏడి టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ రికార్డు సమయంలో పూర్తయింది. 55 గంటల రికార్డు సమయంలో ఫౌండేషన్ పూర్తయిందని సిఆర్డీయే కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్ పనుల తుది దశకు జీఏడి టవర్‌కు మొత్తం 11వేల 236 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను నిరాటంకంగా 55 గంటల్లో వేయడం జరిగింది. దేశంలో ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఇలా చేయడం రికార్డు అని అధికారులు చెప్పారు. మొత్తం ఏడు రోజుల్లో మూడు టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి కాగానే మూడు టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ హీట్ కంట్రోల్‌కు రెండు వరసలు ప్లాస్టిక్ షీట్లు, మధ్యలో 50 ఎంఎం ధర్మోకోల్ షీట్లను పరిచారు. ధర్మో కఫ్లర్స్ ద్వారా కంప్యూటర్ల సాయంతో హీట్ కంట్రోల్‌ను పరిశీలిస్తున్నారు. మూడు టవర్లకు గాను 32వేల క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులకు సంబంధించి మొత్తం 15 వందల మంది కార్మికులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.,సెక్రటేరియట్, హెచ్ఓడి ప్రాజెక్టు పనుల లక్ష్యం మొత్తం 36 నెలలు కాగా ఇప్పటికే మూడు నెలల్లో మూడు టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా 33 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను నిర్ధేశించుకున్నారు.
ప్రాజెక్టు స్ట్రక్చర్ మొత్తం 24 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యం ఉందని, మిగతా 12 నెలల్లో ఇంటీరియర్, ఇతర పనుల పూర్తికి ప్రణాళిక రూపొందించుకున్నామని అధికారులు తెలిపారు. సెక్రటేరియట్, హెచ్ఓడి పూర్తిగా డయాగ్రిడ్ సాంకేతిక విధానంలో నిర్మించడం జరుగుతుందని, ప్రపంచంలో ఈ విధానంలో భవనాలు నిర్మించినప్పటికి దేశంలో మాత్రం పూర్తిగా డయాగ్రిడ్ సాంకేతిక విధానంలో నిర్మాణం మాత్రం ఇదే ప్రథమం. మొత్తం మీద అమరావతి నిర్మాణం నుంచే రికార్డులను సృష్టిస్తోంది. అందరినీ ఆకర్షిస్తోంది.













