కడప స్టీల్ ప్లాంట్ కథ కంచికేనా?
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయించడంతో ఆంధ్రుల కళ్లన్నీ కడప స్టీల్ ప్లాంట్ పైనే ఉన్నాయి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వమే ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాక.. పునర్విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం కూడా మాటిచ్చింది. అయితే అది ఇంతవరకూ సాకారం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నాలు చేసింది. అన్నీ ఓకే అయ్యాయి.. ఇక ప్లాంట్ నిర్మాణమే తరువాయి అనుకుంటున్న సమయంలో దీనికి మళ్లీ బ్రేక్ పడింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. అయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం లాభసాటి కాదనే సాకుతో దీన్ని నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో గత చంద్రబాబు ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే అది కూడా అటకెక్కింది. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రిస్టీజియస్ గా తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జమ్మలమడుగు సమీపంలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసింది.
పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ఔత్సాహిక ప్రైవేటు కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లిబర్టీ స్టీల్స్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు లిబర్టీ స్టీల్స్ తో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినట్లు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. లిబర్టీ స్టీల్స్ కంపెనీ ఆర్ధిక పరిస్థితి సరిగా లేనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. లిబర్టీ స్టీల్స్ కు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయని.. ఆ ప్రభావం కంపెనీపై పడిందని వివరించారు.
కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలు కొత్తకాదు.. గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మిణి స్టీల్స్ నిర్మించేందుకు గాలి జనార్ధన్ రెడ్డి ముందుకొచ్చారు. అది పెద్ద కుంభకోణంగా మారి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో ఓసారి స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు జగన్ కూడా శంకుస్థాపన చేసారు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. మరి కడప స్టీల్ ప్లాంట్ కు మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఏమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.













