శంకరాచార్యులను అడిగారా? జీయర్ ను అడిగారా? గోవిందానంద సరస్వతీ

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే అంటూ టీటీడీ కట్టుబడటంపై గోవిందానంద సరస్వతీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ అందించిన ఆధారాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హనుమంతుడి జన్మ స్థలంపై వివాదం రేగిన నేపథ్యంలో సంస్కృత విద్యాపీఠంలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలకు కిష్కింధ ట్రస్ట్ పక్షాన గోవిందానంద సరస్వతీ, టీటీడీ తరపున పండిత పరిషత్ కమిటీ చర్చల్లో పాల్గొంది. ఈ సందర్భంగా గోవిందానంద సరస్వతీ మాట్లాడుతూ… టీటీడీ ఆధారాలు ప్రామాణికంగా లేవని పేర్కొన్నారు. కాలం విషయంలో టీటీడీకి క్లారిటీ లేదని, మూడు తిథులు రాశారని, జన్మ తేదీ లేనప్పుడు స్థలాన్ని ఎలా ప్రకటిస్తారు? అని సూటిగా ప్రశ్నించారు.
హనుమంతుడి జన్మస్థల నిర్ణయాన్ని శంకరాచార్యులనైనా, కనీసం తిరుమల జీయర్ స్వాముల వారినైనా అడిగిందా? అని సూటిగా ప్రశ్నించారు. రామాయణంలో పంపా అని వుందని, పురాణం ప్రమాణం కాదని, రామాయణాన్ని టీటీడీ ప్రమాణంగా తీసుకోవాలని సూచించారు. అసలు ఇంతటి కీలక చర్చను బహిరంగంగా చేయాలని, బహిరంగంగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పీఠాధిపతుల సమక్షంలోనే నిర్ణయాలు జరగాలని, ఎవరు పడితే వారు కమిటీలు వేసి, ఇంతటి గంభీరమైన విషయాల్లో నిర్ణయం చెప్పకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాల్లో శంకర, రామానుజ, మధ్వ పీఠాధిపతులు పాల్గొనేలా చేయాలని, వారు మాత్రమే నిర్ణయం తీసుకోగలరని, ఈ పండిత పరిషత్‌కు అసలు అర్హతే లేదని గోవిదానంద సరస్వతీ ఘాటుగా వ్యాఖ్యానించారు.