ఘనంగా ఏపీ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మానవ మనుగడకు దోహదపడే ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, ఇచ్చాఫురంలలో నిర్వహించిన పలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను ఆవిష్కరించారు. జీవితకాల సాఫల్య పురస్కారాలు సాధించిన వారికి జ్ఞాపికలను అందజేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సవాళ్లను పరిష్కరించేందుకు శాస్త్ర విజ్ఞానం ఉపయోగపడాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆకాక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు ప్రభుత్వ పరంగా ఒక విధానాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు మాట్లాడారు. ఇచ్ఛాపురంలో పూర్వ విద్యార్థి వెంకటేష్ రూ.1.50 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు భవనాన్ని గవర్నర్ ప్రారంభించారు.













