నిమ్మగడ్డను కొనసాగించండి: గవర్నర్
ఎన్నికల కమిషనర్ విషయంలో మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో మొట్టికాయలు తిన్న ప్రభుత్వానికి ఈ సారి రాష్ట్ర గవర్నర్ తనదైన దెబ్బ రుచి చూపించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని ఆయన బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ఎన్నిక వాయిదా అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని బలంగా నమ్మిన వైఎస్ జగన్ సర్కార్… కొత్త ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను పదవీ చ్యుతుడ్ని చేసిన ఉదంతం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోర్టులు తప్పు బట్టాయి. నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అయినప్పటికీ పట్టు వదలకుండా నిమ్మగడ్డ విషయంలో ముందుకే వెళుతున్న జగన్ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ప్రస్తుతం సుప్రీంలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నిమ్మగడ్డ గవర్నర్ హరిచందన్‌ను కలిశారు. హైకోర్టు ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని, తనను పదవిలో పునర్నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై రాజ్యంగ నిపుణులతో చర్చించిన అనంతరం గవర్నర్ నిమ్మగడ్డ వినతకి అనుకూలంగా ఆదేశాలిచ్చారు.
గవర్నర్ నిర్ణయం పట్ల విపక్షనేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడే నిర్ణయమన్నారు. అదే విధంగా సిపిఐ నేత నారాయణ, రామకృష్ణ తదితరులు సైతం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇకనైనా భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను పదవిలో కొనసాగించాలని వీరు కోరారు.













