ప్రతిభకు ఏపీ ప్రభుత్వ పురస్కారం
ఘనంగా వైఎస్ఆర్ అవార్డుల బహుకరణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న సంస్థలకు, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ అవార్డులతో ఘనంగా సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్ అంబాసిడర్లైన కళలు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశారు. ఓ డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి అవార్డులు ఇచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్ఎన్ ఛారిటీస్, సీపీ బ్రౌన్ లైబ్రరీ, వేటపాలెం గ్రంథాలయం, ఆర్డీటీ సంస్థ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.. ఇలాంటి గొప్ప సంస్థలకు అవార్డులు ఇచ్చి వాటి సేవలను అందరూ ప్రశంసించేలా చేశారు. అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులను కూడా వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులతో ఘనంగా సత్కరించింది.
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీన విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక నుంచి ఏటా నవంబర్ 1వ తేదీన వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించారు. తొలుత అమర జీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం 2021 సంవత్సరానికిగాను 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు కలిపి మొత్తం 59 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు.
పద్మ అవార్డుల తరహాలో…
కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో సేవలందించిన గొప్పవారిని దేశంలో అత్యున్నత అవార్డులైన భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ తదితర అవార్డులతో సత్కరిస్తోంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి రాష్ట్రం తరపున అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించిన నేపథ్యంలో వైఎస్సార్ అవార్డులను నెలకొల్పామని ముఖ్యమంత్రి తెలిపారు.
మహామనిషి పేరుతో అత్యున్నత పురస్కారాలు
మహానేత వైఎస్సార్ పేరు చెబితే అందరికీ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచెకట్టులో కనిపిస్తుంది. తన ప్రతి అడుగులోనూ వ్యవసాయం మీద మమకారం కనిపిస్తుంది. పల్లెలు, పేదల మీద అభిమానం తనను చూడగానే గోచరిస్తాయి. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం, అందరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన.. ఇవన్నీ వైఎస్ఆర్ను చూడగానే గుర్తొచ్చే విషయాలు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆ మహానుభావుడి పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల పేరుతో ఏర్పాటు చేశామని, లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నామని చెప్పారు.
ఎందరో మహానుభావులు…
మన తెలుగు సంస్కృతి, కళలు, మానవతామూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగా వీటిని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ప్రకటించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్ అంబాసిడర్లైన కళలు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశామని, ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవని ముఖ్యమంత్రి తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్ఎన్ ఛారిటీస్, సీపీ బ్రౌన్ లైబ్రరీ, వేటపాలెం గ్రంథాలయం, ఆర్డీటీ సంస్థ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.. ఇలాంటి గొప్ప సంస్థలు చేస్తున్న సేవలకు ఇస్తున్న అవార్డులు ఇవన్నారు. వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులుగా పేర్కొంటూ, కలం యోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులు చేస్తున్న సేవలను గుర్తించి ఇస్తున్న అవార్డులు ఇవన్నారు. కోవిడ్ సమయంలో అయినవారే దగ్గరకు రాని పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అన్నీ తామై వారాలు, నెలలు పాటు కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసామాన్యమైన సేవలందించిన మానవతామూర్తు లకు ఈ అవార్డులు ఇస్తున్నామని, మీ అందరి కుటుంబ సభ్యుడిగా, తెలుగుజాతి మాణిక్యాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తొమ్మిది సంస్థలకు పురస్కారం
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో 9 సంస్థలు ఉండగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారు 11 మంది ఉన్నారు. కళలు, సంస్కృతి రంగాల నుంచి 20 మంది, సాహిత్యరంగంలో ఏడుగురు, పాత్రికేయ రంగానికి చెందినవారు ఆరుగురు, కోవిడ్ సేవలు అందించిన ఆరుగురు ప్రభుత్వ వైద్యాధికారులు/ సిబ్బంది అవార్డులకు ఎంపికయ్యారు. మరణించిన ఐదుగురు అవార్డు గ్రహీతల తరపున వారి కుటుంబ సభ్యులు అవార్డులను స్వీకరించారు. అనివార్య కారణా లతో పాత్రికేయ దిగ్గజం ఏబీకే ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో తరువాత ప్రత్యేకంగా అవార్డు అందించాలని నిర్ణయించారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా తరపున ఆమె కుమార్తె అవార్డు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణ దాస్, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎం.శంకర్ నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తానేటి వనిత, జి.జయరాం, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణ మోహన్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్నవారి మాటలు
కళాకారులు, వృత్తి నైపుణ్య తదితర రంగాల వారిని ఎంపిక చేయటం గొప్ప విషయం. ఇన్ని రంగాలవారికి పురస్కారాలు అందించటం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమం. 1వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాల రూపకల్పన, భాషా పరిశోధన, సామాజిక రంగాలలో నా కృషిని గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని కడప జిల్లాకు చెందిన సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి తెలిపారు.
సాహిత్యం, విద్య, సామాజిక రంగాల్లో నా కృషికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందించినందుకు సంతోషంగా ఉందని గుంటూరుకు చెందిన ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
దేశంలో కళలు అభివృద్ధి చెందటానికి ప్రోత్సాహం చాలా అవసరం. రాష్ట్రంలో కళలు, వ్యవసాయం వంటి వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేస్తున్న వారిని సత్కరించిన ముఖ్యమంత్రి జగన్ అభినందనీయులు. నాకు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని నెల్లూరు జిల్లాకు చెందిన రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించడం హర్షణీయమని ఈ అవార్డు రాకతో మరింత ఉత్సాహంతో మరిన్ని రచనలు రాయడానికి కృషి చేస్తానని అనంతపురం జిల్లాకు చెందిన ప్రొ. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
అన్ని రంగాలవారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు ఇమామ్ అన్నారు.
ఇలాంటి ప్రోత్సాహకాలు రాజ్యాంగం ప్రకారం సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళుతాయి. కవులను, కళాకారులను, ట్రస్ట్‌లను, గ్రంథాలయాలను, విద్యా సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మనలో ఒక సాంస్కృతిక భావజాలం ఏర్పడుతుందని అది జ్ఞానాన్ని పెంచుతుందని కత్తి పద్మారావు అన్నారు.
మా నాన్న వంగపండు ప్రసాదరావు జీవితాన్ని కళకే అంకితం చేశారు. ఈ రోజు ఆయన గొప్పతనాన్ని గుర్తించి వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె వంగపండు ఉష పేర్కొన్నారు.
సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కడం సంతోషకరంగా ఉందని యోగివేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సూర్యకళావతి పేర్కొన్నారు. సీపీ బ్రౌన్ నివసించిన ప్రాంతంలో గ్రంథాలయం కట్టారు. ఇటీవల సీఎం జగన్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి, గ్రంథాలయం అభివ ృద్ధికి రూ.5.50 కోట్లు కేటాయించారు. ట్రస్టు కింద గ్రంథాలయాన్ని వైఎస్సార్ తొలుత ఎస్వీ యూనివర్సిటీకి ఇచ్చారు. అనంతరం వైవీ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవార్డు ద్వారా గ్రంథాలయానికి మంచి గుర్తింపు లభించిందన్నారు.
సారస్వత నికేతన్ రెండేళ్ల కిందటే శతాబ్ది ఉత్సవాలు చేసుకుంది. ఇప్పుడు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది. కళాకారులను, సాహితీవేత్తలను, వివిధ సంస్థలను గుర్తించి ఒకేసారి గౌరవించడం చాలా గొప్ప విషయమని సారస్వత నికేతన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు.
వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు తరఫున, భక్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు అంటూ, 50-60 సంవత్సరాలుగా రాష్ట్రంలోను, దేశంలోను అనేక సేవా కార్యక్రమాలను తమ ట్రస్ట్ తరపున చేస్తున్నామని, ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు రావడంతో చాలామంది సంతోషిస్తున్నారని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అన్నారు.
మా తాతగారు మల్లాడి సత్యలింగం నాయకర్ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని ఆరాటపడ్డారు. తన ఆస్తులన్నింటినీ మార్చి ట్రస్టుగా పెట్టారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా ట్రస్టుకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఎంఎస్ఎన్ చారిటీస్కుచెందిన మల్లాడి కార్తీక్ నాయకర్ అన్నారు.
రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయానికి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం వల్ల గ్రంథాలయానికి రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఎంతోమందికి గ్రంథాలయం కల్పవృక్షంలా ఉంది. 123 ఏళ్లుగా సేవలందిస్తోందని గెజిటెడ్ లైబ్రేరియన్ ఆర్.సి.హెచ్.వెంకట్రావు అన్నారు.
అనేక రంగాల్లో ఆర్డీటీ సేవలందిస్తోంది. ఆర్టీడీ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు చెబుతున్నామని అనంతపురంలోని ఆర్టీటి ట్రస్టీ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి పేర్కొన్నారు.
పులివెందులలోని అరటిరైతు బలరామిరెడ్డి నల్లపురెడ్డి మాట్లాడుతూ, 1995లో మొట్టమొదటగా టిష్యూ కల్చర్‌ను ప్రవేశపెట్టాను. అరటిసాగులో నాకృషిని గుర్తించి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అవార్డుల ద్వారా వివిధ రంగాల్లోని వ్యక్తుల నైపుణ్యాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన ఉద్యాన రైతు కొట్యాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్గానిక్ పద్ధతిలో ఉద్యాన పంటలను సాగుచేస్తాను. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కోవిడ్‌లో రోగులకు సేవచేయడం దేవుడు ఇచ్చిన అవకాశం. దీన్ని ప్రభుత్వం గుర్తించి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ నీతిచంద్ర అన్నారు.
పొందూరు ఖాదీ బోర్డు కార్యదర్శి డి. వెంకటరమణ మాట్లాడుతూ, పొందూరు ఖద్దరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పొందూరు ఖద్దరు పంచెలే కట్టుకునేవారు. 73 ఏళ్ల చేనేత సహకార సంఘ చరిత్రలో ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు.
103 సంవత్సరాల చరిత్ర కలిగిన మహారాజా ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇటువంటి అవార్డు కళాశాలకు రావడం యావత్ సంగీత ప్రపంచమంతా గర్వించదగినది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపల్ హోదాలో నేను అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని ఆర్.వి. ప్రసన్న కుమారి పేర్కొన్నారు.
ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో కాలిగ్రాఫీకి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు అభించింది. ఈ కళ అత్యంత అరుదైన కళ. దీన్ని నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు శ్రమించాలి. కానీ నేర్చుకుంటే ఆ కళాకారునికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దానికి ఇదే నిదర్శనం. ఈ రోజు నా శ్రమను, కళను గుర్తించి అవార్డు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు అని పరమేశ్వరరాజు.చెప్పారు.
రెండొందల శతాబ్దాలుగా విజయనగరంలో బొబ్బిలి వీణ తయారు చేస్తున్నాం. నేను మూడోతరం. ప్రస్తుతం మాలో ఐదోతరం వారు కూడా వీణల తయారీలో ఉన్నారు. యాభై ఏళ్లుగా బొబ్బిలి వీణను తయారు చేస్తూ మరికొంత మందికి నేర్పిస్తున్నాను. ఎనిమిది రకాల మెమెంటో వీణలు తయారు చేయడం ప్రధానంగా మారింది. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా భావించే బొబ్బిలి వీణకు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని సర్వసిద్ధి అచ్యుతనారాయణ అన్నారు.
విశిష్ట సేవలు.. ప్రతిభకు గుర్తింపు ఈ అవార్డులు – గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులకు ఎంపిక చేయడం ముదావహమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఏర్పడ్డ రాష్ట్ర అవతవరణ దినోత్సవం రోజు ఏటా వైఎస్సార్ అవార్డులను ఇవ్వడం సముచిత నిర్ణయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అవార్డుల ఎంపికలో పారదర్శకత పాటించాం
తమ ప్రభుత్వం అన్నీ విషయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గరనుంచి ప్రతి సంక్షేమ పథకాన్నీ పేదలకు అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధని తాము తీసుకువచ్చామని ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదని, పార్టీలు, రాజకీయ భావాలను కూడా చూడలేదని జగన్ మోహన్ రెడ్డి వివరించారు. విభేదించే భావాలున్నా మనుషుల్లో కూడా మహామనుషులను చూశాం. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా అవార్డులను ఇస్తున్నామని తెలిపారు.













