నవంబరు 1న ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. అమరావతి సచివాలయంలో వేడుకల నిర్వహణపై వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులతో ఆయన సమావేశమయ్యారు. జాతిపిత గాంధీజి 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని, ఆంధ్రప్రదేశ్ అవతరణకు కృషి చేసిన వారిని, వారి కుటుంబ సభ్యుల్ని సత్కరించేలా వేడుకలు సాగాలని సూచించారు. తెలుగు భాష, సంస్కృతికి, విశేష సేవలందించిన వారికి, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందించేందుకు వీలుగా అర్హుల జాబితాను సిద్దం చేయాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అవార్డుల జాబితా ఎంపికకు ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.













