సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం..!
ఆంధ్రప్రదేశ్లో తమ డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించి రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై కూటమి ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించి నిరసనలకు దిగడంపై సీరియస్ అయిన సర్కార్.. బాధ్యులైన ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రజలకు సేవలందకుండా ఇబ్బందులు సృష్టించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, ఉద్యోగులను రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించిన 46 మంది ఉద్యోగులను పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిరసన ప్రదర్శనలు, ధర్నాల వద్ద సేకరించిన వీడియో విజువల్స్, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా వీరిని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనావళిని (Conduct Rules) ఉల్లంఘించి, విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ ఈ 46 మందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో, సదరు నిరసనకారులపై చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన సచివాలయ ఉద్యోగులందరికీ తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. నిర్దేశిత గడువులోగా వారు ఇచ్చే వివరణ తృప్తికరంగా లేకపోతే విధులనుంచి సస్పెండ్ చేయడం లేదా సర్వీస్ రూల్స్ ప్రకారం కఠినమైన శిక్షలు విధించేందుకు వీలుగా ఫైళ్లు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా దూకుడుతో సచివాలయ ఉద్యోగ సంఘాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.








