Gorantla Butchaiah : ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకుందా? : ఎమ్మెల్యే గోరంట్ల
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్ (Jagan) మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdhury) అన్నారు. అమరావతి(Amaravati) లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యా నికి విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. నీ బతుకే అబద్ధాల బతుకు, ఖబడ్దార్ జగన్‌రెడ్డి అని హెచ్చరించారు. పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతిభ్రమించి ప్యాలెస్‌లో టీవీ (TV )లు పగలగొడుతూ ఇలా మాట్లాడతావా? రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను వెనకేసుకొస్తారా? వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను హింసించారు. ఐదేళ్లూ నియంతలా పాలించావు. నేడు మళ్లీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా? పల్నాడు జిల్లా పర్యటనలో ఇద్దరు మృతిచెందితే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదెందుకు? ఇకనైనా జగన్ కపట నాటకాలను కట్టిపెట్టాలన్నారు.
అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకుందా? అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారో దమ్ముంటే చర్చకు సిద్ధమా? యోగాంధ్రను పక్కదారి పట్టించేందుకు అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాలన సాగిస్తున్నందునే జగన్ బయట తిరుగుతున్నారు. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదు. ప్రభుత్వం కఠినంగా వ్యహరించాల్సి వస్తుంది. అప్పుడు బయట తిరగలేరు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అని అన్నారు.













