AI Data Center: విశాఖలో ఏఐ డేటా సెంటర్ : రామ్ మోహన్ నాయుడు

అమెరికా బయట భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ను (AI Data Center) ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా రాష్ట్ర జీడీపీ ఏటా రూ.11 వేల కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా భారత్ నాయకత్వాన్ని మెరుగుపరుస్తుందన్నారు. విశాఖపట్నం (Visakhapatnam) లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్థి, స్వావలంబన ప్రస్థానంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును కీలక మైలురాయిగా అభివర్ణించారు. దీంతో విశాఖకు అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు మెరుగుపడుతుందని వివరించారు. ఏపీని డిజిటల్ హబ్ గా నిలపడంలో, దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత పరివర్తనను వేగవంతం చేయడంలో ముందడుగని వ్యాఖ్యానించారు.