Secretariat: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి గుడ్ న్యూస్..
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గత 9 నెలలుగా తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. కొత్త ప్రభుత్వం రావడంతో, తమ పరిస్థితి ఏవిధంగా మారుతుందోననే ఆందోళన వారిలో పెరిగింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో అనేక సమస్యలు ఉండటంతో, టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందని వారు ఆశించారు.
తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (Dola Bala Veeranjaneya Swamy) సచివాలయ ఉద్యోగ (Sachivalayam Employees) సంఘాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, ఉద్యోగుల భవిష్యత్తుపై ఉన్న అనేక అనుమానాలకు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులను తొలగిస్తారని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. అందరూ కొనసాగుతారని, పైగా వ్యవస్థ మరింత సమర్థంగా పని చేయేందుకు రేషనలైజేషన్ చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,30,694 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. కానీ అన్ని సచివాలయాల్లో ఒకే విధంగా ఉద్యోగుల సంఖ్య లేదని ప్రభుత్వం గుర్తించింది. కొన్ని చోట్ల ఎక్కువ మంది సిబ్బంది ఉంటే, మరికొన్ని చోట్ల తక్కువ మంది ఉండటం వల్ల పనిభారం సమంగా లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సచివాలయాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీలో 2,500 జనాభా లోపు ఉంటే అక్కడ ఒక సచివాలయం ఉండి, ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. బీ కేటగిరీలో 2,500 నుంచి 3,500 మంది జనాభా పరిధిలో ఏడుగురు సిబ్బంది ఉంటారు. సీ కేటగిరీలో 3,500 మంది పైగా జనాభా ఉంటే ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు. ఈ విధంగా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు మరింత సమర్థమైన సేవలు అందేలా చూస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ విధానం ద్వారా దాదాపుగా 40,000 మంది సచివాలయ సిబ్బంది మిగులుగా ఉంటారని అంచనా. దీంతో వారు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం వారిని ఖాళీగా ఉంచకుండా, ఇతర ప్రభుత్వ శాఖల్లో వారి అర్హతలకు తగ్గట్లు నియమిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖతో చర్చించి వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇలాంటి భరోసా కావడంతో సచివాలయ ఉద్యోగులు కొంత ఊరట చెంది, తమ విధులు సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయన్న ఆశ వారిలో నెలకొంది. ఈ విధంగా సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.













