డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
మహిళల ఆత్మగౌరవం కోసమే డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అమరావతిలోని ప్రజావేదికలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. త్వరలోనే డ్వాక్రా సంఘాల సభ్యులకు స్మార్ట్ఫోన్లు ఇవ్వనున్నట్లు మరోసారి సృష్టం చేశారు. మానవ సంబంధాలు ముఖ్యమని, కుటుంబ వ్వవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు. 98 లక్షల మంది పేద మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయని తెలిపారు. డ్వాక్రా వంటి శక్తిమంతమైన సంఘాలు ఎక్కడా లేవని చెప్పారు. త్వరలోనే మహిళా డ్రైవర్లు వస్తారని.. అంది ఎంతో దూరం లేదన్నారు.
డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, కోటీ మంది ఆడ బిడ్డలకు పసుపు కుంకుమ ఇస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా వడ్డిలేని రుణాలను వారికి ఇస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా వెళ్తాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, మాతృమూర్తిని గౌరవించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సామూహక సీమంతాల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.













