ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు
ప్రభుత్వ ఉద్యోగుల వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ఇంకా సమయం పట్టనున్నందున ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. 2018 జులై 1 నుంచి ఇది వర్తిస్తుంది. పెంచిన ఐఆర్‌ని వచ్చే జూన్ నుంచి ఉద్యోగులకు అమలు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ భేటీకి ముందు ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ముఖ్యమంత్రి వారితో విపులంగా చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్‌తో సమానంగానైనా తమకు మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. వారి డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. 20 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.













