Chandra Babu: ఇంటింటికీ సుపరిపాలన.. ప్రజల అభిప్రాయాల తెలుసుకోవడానికి రెడీ అంటున్న టీడీపీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ నెల 23వ తేదీని ఒక కీలక రోజు గా ఎంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో, గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే నూతన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీని కోసం “ఇంటింటికీ సుపరిపాలన” అనే పేరుతో ఓ ప్రత్యేక ప్రచారం ప్రారంభించాలన్న ఆదేశాలు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు అందించినట్లు సమాచారం.
ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వ పన్ను డబ్బుతో ఏమేం చేయబడుతుందో అవగాహన కలిగించేందుకు అవసరమే. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలనను ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రచారాల్లో యమ శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇదే బాటలో ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) “గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం” నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ (TDP) అదే తరహాలో అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్రచారం సులభమైనది కాదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటింటికి వెళ్లే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అసలు అభిప్రాయాలు వెలుగు చూడనున్నాయి. పాలనపై సంతృప్తికరమైన స్పందన లభిస్తే అది మంచి సూచన కానీ, అసంతృప్తి ఉంటే మళ్లీ ఆ మార్గాల్లో ప్రభుత్వం తిరిగి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఇసుక , మద్యం లాంటి సమస్యలపై ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తుండటం గమనార్హం.
ఇంకా సంక్షేమ పథకాలు నిజంగా ఎంతమందిని చేరుకున్నాయో ఈ ప్రచారంలో స్పష్టమవుతుంది. ప్రతి ఎమ్మెల్యే పనితీరు మీద ప్రజలే నేరుగా స్పందించనున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి అద్దంగా మారుతుంది. అయితే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం ఒక సంగతి… అవి తెలిసిన తర్వాత వాటిపై చర్యలు తీసుకోవడమే అసలైన నాయకత్వ లక్షణం. గతంలో వైసీపీ పాలనలో లోపాలు కనిపించినా వాటిని సరిచేయకుండా ఉండటం వాళ్ల ఓటమికి దారితీసింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అలానే వ్యవహరిస్తారా? లేక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, మార్పులు చేపడతారా? అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఈ ప్రచార కార్యక్రమం కేవలం ప్రచారంగా కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకునే అవకాశంగా మారితే… అది ప్రభుత్వానికి బలాన్నే ఇస్తుంది. మరి ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.