బీజేపీకి ‘గాజు గ్లాసు’ టెన్షన్!
తిరుపతి ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారపర్వంలోకి దిగిపోయాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడం మాత్రమే కాకుండా భారీ మెజారిటీ సాధించాలని అధికార వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వరుస ఎన్నికల్లో ఓటమి ప్రభావాన్ని ఇక్కడ గెలిచి తుడిపేసుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలనుకుంటోంది. ఒకవేళ విజయం దక్కకపోతే.. టీడీపీని వెనక్కు నెట్టి రెండో స్థానాన్నయినా దక్కించుకోవాలనుకుంటోంది. అయితే ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడింది.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే తిరుపతి సీటును బీజేపీకి వదులుకుంది జనసేన. అంతకుముందు ఇక్కడ తామే పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నించింది. తిరుపతిలో సామాజిక వర్గం తమకు బాగా కలిసొస్తుందని.. అందుకే తమకు సీటు కేటాయించాలని పోరాడింది. అయితే బీజేపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గిన పవన్ కల్యాణ్.. సీటును కమలానికి వదిలేశారు. అయితే జనసేన శ్రేణుల్లో మాత్రం సీటును వదిలేసుకున్నామనే ఫీలింగ్ బలంగా నాటుకుపోయింది. అందుకే జనసేన శ్రేణులు తమకు సహకరించవేమోననే ఆందోళన కూడా బీజేపీలో ఉంది.
ఇంతలో జనసేన పార్టీ సింబల్ మరో సమస్యగా మారింది బీజేపీకి. జనసేన అధికారిక సింబల్ గాజు గ్లాసు. ఏపీలో గాజు గ్లాసు ఎక్కడ కనిపించిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీనే గుర్తుకొస్తుంది. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదు. దీంతో ఆ సింబల్ ను వేరేవాళ్లకు కేటాయించింది ఎన్నికల సంఘం. జనసేన గుర్తయిన గాజు గ్లాసును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో బీజేపీ-జనసేన కూటమికి భారీ షాక్ తగిలినట్లయింది. గత ఎన్నికల్లో గాజు గ్లాసు ద్వారా జనసేన శ్రేణులు బరిలోకి దిగాయి. దీంతో ఆ సింబల్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ సింబల్ ను వేరే వాళ్లకు కేటాయించడంతో తమపై కచ్చితంగా ప్రభావం పడుతుందేమోననే ఆందోళన బీజేపీలో మొదలైంది.
వాస్తవానికి ఒక పార్టీ గుర్తును మరో అభ్యర్థికి కేటాయించడానికి వీలు లేదు. అయితే జనసేన పార్టీ సింబల్ ను వేరేవాళ్లకు కేటాయించడానికి వేరే కారణం ఉంది. జనసేన పార్టీకి ఇప్పటికి గుర్తింపు లేదు. గుర్తింపు లేని పార్టీలకు కేటాయించిన సింబల్ ను ఆ పార్టీ పోటీ చేయనప్పుడు వేరే వాళ్లకు కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. జనసేన పార్టీకి గుర్తింపు లేకపోవడం.. ఆ పార్టీ ఎన్నికల బరిలో లేకపోవడంతో గాజు గ్లాసు సింబల్ ను నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల సంఘం తీరుపై బీజేపీ, జనసేన మండిపడుతున్నాయి. ఇలా ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నాయి. అయితే తాము నిబంధనల ప్రకారమే గుర్తులు కేటాయించినట్లు ఈసీ చెప్తోంది.
గాజుగ్లాసు సింబల్ పొందిన నవతరం అభ్యర్థి మాత్రం ఫుల్ హ్యాపీ. కానీ బీజేపీకి మాత్రం ఇది అశనిపాతంలా మారింది. జనసేన శ్రేణులు గాజు గ్లాసు కనిపిస్తే చాలు గుద్దేస్తారు. వాళ్లకు తమ పార్టీ అధినేత, పార్టీ సింబలే ముఖ్యం. అందుకే తమకు బదలాయింపు కావాల్సిన ఓట్లన్నీ ఇప్పుడు గాజు గ్లాసుకు పడిపోతాయేమో అనే ఆందోళన బీజేపీలో మొదలైంది. మరి గాజు గ్లాసు ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతమేర ఉంటుంది.. అది బీజేపీకి ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందనేది ఫలితాలు వస్తేకానీ తెలీదు.













