కబ్జా గీతం…రాజకీయ రాగం…
ఆంధ్రప్రదేశ్‌లో మరో తెలుగుదేశం పార్టీ నేతకు ప్రభుత్వం వైపు నుంచి గట్టి దెబ్బ తగిలింది. గత ప్రభుత్వ హయంలో అవకతవకలు జరిగాయంటూ వరుసగా పలువురు దేశం నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం మరో తేదేపా నేతపై ఉక్కుపాదం మోపింది. ఈసారి తెలుగుదేశం పార్టీ నేత, నందమూరి బాలకృష్ణ అల్లుడు, గత ఎన్నికల్లో తేదేపా తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన శ్రీభరత్ వంతు వచ్చింది.ఆయనకు చెందిన గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని ఆరోపిస్తూ వైసీపీ సర్కార్ చర్యలు చేపట్టింది. గీతంపై చర్యలకు కొన్ని నెలల క్రితమే బీజం పడగా అవి శనివారం ఆచరణలోకి వచ్చాయి.
శనివారం ఉదయం నుంచే ప్రభుత్వ అధికారులు గీతం వర్సిటీ ఆధ్వర్యంలోని కబ్జా భూములను స్వాధీన ప్రక్రియ ప్రారంభించారు. మధ్యాహ్నం కల్లా రిషికొండ బీచ్ వైపు ఉన్న దాదాపుగా 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. దాదాపుగా 40 ఎకరాలు గీతం కబ్జా చేసినట్టు గుర్తించామని, మిగిలిన భూముల్ని కూడా స్వాధీనం చేసుకుంటామని వీరు అంటున్నారు. కబ్జా భూముల్లో పక్కా భవనాలు ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు.
అయితే ఆ భూములు తాము ఆక్రమించలేదని, తగిన ధర చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేసి ఉన్నట్టు గీతం వర్గాలు చెబుతున్నాయి. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరపడమేమిటంటూ విమర్శిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై మండిపడింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్‌లు ఈ కూల్చివేతలు దారుణమని, ఇది కక్షసాధింపేనని విమర్శించారు.
గతంలో అనకాపల్లి కి చెందిన తేదేపా నేత సబ్బం హరికి చెందిన ఆక్రమణలను కూల్చివేసిన ఉదంతమూ తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల ఆరోపణలతో తెలుగుదేశం నేతలకు వైకాపా సర్కార్ చెక్ పెడుతున్న నేపధ్యంలో తాజాగా గీతం పై చర్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.













