కార్మిక సంఘాల సమక్షంలో.. గంటా మరోసారి రాజీనామా
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖలోని కూర్మన్నపాలెం గేట్ ముఖ ద్వారా వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరహార దీక్ష చేపట్టాయి. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేసిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో లేదన్న విమర్శల నేపథ్యంలో కార్మిక సంఘాల సమక్షంలోనే మరోసారి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకే రాజీనామా చేసినట్టు చెప్పారు. కార్మిక ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని సృష్టం చేశారు.













