ఆ రుణం తీర్చుకోవడం కోసమే ఈ నిర్ణయం..
తెలుగుదేశం పార్టీని వదిలించుకోవడం కోసం విశాఖ ఉక్కును ఒక అవకాశంగా తీసుకుని ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారనే విమర్శలొస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. టీడీపీ వదిలించుకోవాలంటే ఇంత సీన్ క్రియెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో తనకు ఇబ్బందులు ఉంటే నేరుగా తమ నాయకుడు చంద్రబాబును కలిసి, సమస్యలను వివరించి పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పగలనన్నారు. విశాఖపట్టణం తనకు మంచి గుర్తింపు, భవిష్యత్తు ఇచ్చిందని.. ఆ రుణం తీర్చుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని సృష్టం చేశారు. తాను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశానని, వంద శాతం ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలనే ఉద్దేశంతోనే పదవికి రాజీనామా చేశారన్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయనని, స్టీల్ ప్లాంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తిని నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేద్దామన్న ఆలోచన ఉందన్నారు. ఉక్కు కర్మాగారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి మంచి సంకల్పంతో ముందుకు వెళితే లక్ష్యం నెరవేరుతుందనే నమ్మకం ఉందని అన్నారు.













