గంటా వేసిన స్కెచ్ పని చేస్తుందా ??
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు. దాన్ని ఆమోదింపచేసుకునేందుకోసం స్పీకర్ తమ్మినేనిని కలిశానని చెప్తున్నారు. శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లిన గంటా శ్రీనివాసరావు.. అక్కడి నుంచి స్పీకర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ స్పీకర్ తమ్మినేనితో చాలాసేపు ఏకాంతంగా చర్చించారు. రాజీనామా ఆమోదం కోసమేననేది గంటా చెప్పిన మాట. స్పీకర్ తమ్మినేని మాత్రం పాతమిత్రులం కాబట్టి చాలా విషయాలు చర్చించుకున్నామని చెప్పారు.
గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేశానని చెప్తున్నారు. అందుకోసం త్వరలోనే నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఉండవల్లి, జేడీ లక్ష్మినారాయణ తదితరులతో భేటీ అయినట్లు వివరించారు. అంతేకాదు.. ఉపఎన్నికలో తాను పోటీ చేసే ఉద్దేశం కూడా లేదన్నారు. ఇదంతా పైకి బాగానే కనిపిస్తోంది. అయితే దీని వెనుక గంటా వ్యూహం వేరేలా ఉందనేది విశ్లేషకుల అంచనా.
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వెళ్లే నేతల్లో గంటా పేరే మొదట వినిపించింది. గంటా టీడీపీకి అంటీముట్టనట్లు వ్యవహరించడం కూడా ఇందుకు బలం చేకూర్చింది. ఈ మధ్య విజయసాయి రెడ్డి కూడా గంటా కొన్ని ప్రతిపాదనలు పంపించారని.. వాటిని అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు. వాటికి ఓకే అయితే గంటా పార్టీలోకి రావడం ఖాయమని ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే గంటా మాత్రం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అనూహ్యంగా టీడీపీలో యాక్టివ్ అయ్యారు. దీంతో గంటా గోడ దూకుతారనే ఊహాగానాలకు చెక్ పడింది.
ఇంతలో స్టీల్ ప్లాంట్ వ్యవహారం గంటా శ్రీనివాసరావుకు బాగా కలిసొచ్చింది. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తే తనకు కలిసొస్తుందని భావించారు. వెంటనే రాజీనామా చేశారు. పైగా అన్ని పార్టీల నేతలూ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం గంటాకు కూడా తెలుసు. అందుకే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తాను.. రాజీనామా చేసి బయటికొచ్చి.. ఉపఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేయాలనుకుంటున్నారట. స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేశాను కాబట్టి మిగిలిన పార్టీలు పోటీ చేసేందుకు ముందుకు రాకపోవచ్చనేది ఆయన వ్యూహమట.
అన్నీ అనుకున్నట్టు జరిగితే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారు. ఆ తర్వాత స్వతంత్ర్య ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు. తాను పోటీ చేయనని గంటా ఇప్పుడు చెప్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు కాబట్టి గంటానే మళ్లీ పోటీ చేస్తే బాగుంటుందనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి రప్పించుకోవడం ద్వారా తానే మళ్లీ బరిలో నిలుస్తారు. అప్పుడు ఏ ఇతర పార్టీలూ పోటీలో నిలబడవు. తాను ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అది కూడా స్వతంత్రుడిగా..! అప్పుడు తాను వైసీపీలో చేరి హ్యాపీగా అధికారం చెలాయించవచ్చు. ఇదే ప్రస్తుతానికి గంటా వ్యూహమనేది ఆయన అనుచరులు, విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.













