గన్నవరం నుంచి మైసూరుకు విమాన సర్వీసు
పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గన్నవరం విమానాశ్రయానికి కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశీయంగా తొమ్మిది నగరాలకు, అంతర్జాతీయంగా సింగపూర్‌కు ఎయిర్‌లైన్స్ సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. కొత్తగా కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైసూరుకు ఈ నెల 7వ తేదీ నుంచి రోజువారీ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరుకు నడుపుతున్న విమాన సర్వీసును మైసూరు వరకు విస్తరించిది.
ఈ విమానం రోజు ఉదయం 8:20 గంటలకు బయలుదేరి 10:00కి బెంగళూరుకు చేరుకుంటుందని, అరగంట విరామం అనంతరం 10:30కి బయలుదేరి 11:25కి మైసూరుకు చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. తిరిగి మైసూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు బెంగళూరుకు చేరుకుంటుందని, 25 నిమిషాల విరామం తర్వాత 1:25కి అక్కడి నుంచి బయలుదేరి 2:55కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిర్‌లైన్స్ సంస్థ టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించింది.













