యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరం టికెట్!
ఆంధ్ర ప్రదేశ్ లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఆసక్తి కలిగిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన చాలాకాలంగా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆ ఉత్కంఠకు తెలుగుదేశం పార్టీ స్వస్తి పలికింది. గన్నవరం నుంచి టిడిపి తరఫున ఇటీవలే పార్టీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తారని దాదాపు ప్రకటించింది. టిడిపి గన్నవరం టికెట్ ఇస్తుందా లేకుంటే గుడివాడ పంపుతుందా అనే అనుమానాలకు ఇప్పుడు బ్రేక్ పడినట్లు అయింది.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నుంచి వల్లభనేని వంశీ పోటీ చేసి వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పై గెలుపొందారు. అనంతరం వల్లభనేని వంశీ వైసిపి గుటికి చేరారు. ముందు నుంచి వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇన్నాళ్లు యార్లగడ్డ వెంకట్రావు తనకు ఏదో ఒక పదవి ఇస్తారని ఆశిస్తూ వచ్చారు. లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మళ్ళీ టికెట్ ఇస్తారని భావించారు. అయితే యార్లగడ్డ వెంకట్రావుకు కాకుండా వల్లభనేని వంశీ కే ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ అధిష్టానం.
వచ్చే ఎన్నికల్లో పల్లవినేని వంశీకే టికెట్ ఇవ్వబోతున్నట్లు తాడేపల్లి నుంచి సిగ్నల్ లభించింది. యార్లగడ్డ వెంకట్రావు తన పరిస్థితి ఏంటని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు పార్టీలో ఉంటే ఉండొచ్చు లేకుంటే పోవచ్చు అని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. సజ్జల కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న వెంకటరావు ఇంత జరిగాక పార్టీలో ఉండడం తనకి ఇష్టం లేదన్నారు. తనను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వేదికపై టిడిపి అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు.
యార్లగడ్డ అపాయింట్మెంట్ కోరిన రెండు రోజులకి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం యార్లగడ్డ కలవడం చక చక జరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను యార్లగడ్డ కలిసి టిడిపిలో చేరారు. అనంతరం గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా నారా లోకేష్ యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత యార్లగడ్డను గుడివాడకు పంపి కొడాలి నాని పై పోటీ చేయిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే లోకేష్ ప్రకటన తర్వాత అలాంటి అనుమానాలకు బ్రేక్ పడింది. గన్నవరం నుంచి పోటీ చేస్తా గెలిచి అసెంబ్లీలో జగన్ ను కలుస్తా అని యార్లగడ్డ ఇంతకుముందే ప్రకటించారు. మరి గన్నవరంలో యార్లగడ్డ నెగ్గుతారా ఓడుతారా అనేది వేచి చూడాలి.













