మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి గల్లా ఫ్యామిలీ..!
గల్లా ఫ్యామిలీకి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీ రాజకీయంగానే కాక పారిశ్రామికంగా కూడా మంచి పలుకుబడి సంపాదించుకుంది. అమరరాజా బ్యాటరీస్ తో వేలాది కుటుంబాలకు గల్లా ఫ్యామిలీ దగ్గరైంది. గల్లా రామచంద్ర నాయుడు రాజకీయనాయకుడిగానే కాక పారిశ్రామిక వేత్తగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య గల్లా అరుణ కుమారి, తర్వాత కుమారుడు గల్లా జయదేవ్.. ఇలా వారసత్వంగా రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది ఈ ఫ్యామిలీ. దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి కేంద్రంగా గల్లా ఫ్యామిలీ రాజకీయాలు చేస్తుంటుంది. గల్లా రామచంద్ర నాయుడు అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకులు. ఈయనను గల్లా అరుణకుమారి వివాహం చేసుకున్నారు. గల్లా అరుణ కుమారి తండ్రి పాతూరి రాజగోపాల నాయుడు రెండు చిత్తూరు నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అనంతరం గల్లా అరుణ కుమారి చంద్రగిరి నుంచి నాలుగు సార్లు గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో మంత్రిగా కూడా పని చేశారు. 2014లో ఓడిపోయారు. 2019 ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఆమె కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
రాజకీయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే గల్లా జయదేవ్ ఇటీవల పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అమరరాజా బ్యాటరీస్ కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు దూరంగా ఉండాలని గల్లా ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే అటు గల్లా అరుణకుమారి కానీ, ఇటు గల్లా జయదేవ్ కానీ పాలిటిక్స్ లో ఉండట్లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కానీ అంతకుముందు చిత్తూరు జిల్లాలో జరిగిన యాత్రలో కానీ గల్లా ఫ్యామిలీ పాల్గొనలేదు. అంతేకాక.. గల్లా ఫ్యామిలీ దూరమయ్యారని నిర్ణయించుకున్న టీడీపీ చంద్రగిరి నుంచి ఈసారి పులపర్తి నాని పోటీ చేస్తారని ప్రకటించింది.
అయితే ఇప్పుడు గల్లా ఫ్యామిలీ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయించుకుందనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల గల్లా అరుణ కుమారి పుట్టిన రోజు వేడుకలను అభిమానులు తిరుపతిలో పెద్ద ఎత్తున నిర్వహించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం మళ్లీ యాక్టివ్ అవ్వాలని.. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని అనుచరుల నుంచి భారీ ఒత్తిడి వస్తోంది. దీంతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గల్లా ఫ్యామిలీ ముందుకొస్తే టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది గల్లా ఫ్యామిలీ నిర్ణయించుకోవాల్సిన విషయం.













