కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి: వైఎస్ జగన్
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విజయవాడ జెంబి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అసంపూర్తిగా ఉన్న తూర్పు ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌ను గడ్కరీ సహకారంతో వాయువేగంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.10,600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన పనులపై ఎలాంటి రాజకీయాలు లేకుండా తమ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నట్లు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు సముద్రతీరంలో ఆరులైన్ల రహదారి ఏర్పాటు చేసి దాన్ని 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానించాలని జగన్ కోరారు. దీంతో పాటు విజయవాడ తూర్పు ప్రాంతంలో బైపాస్ రోడ్ల నిర్మాణానికి నిధులు నిధులు కేటాయించాలన్నారు. కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల నుంచి బేస్తవారిపేట, సబ్బవరం నుంచి నర్సీపట్నం వరకు రోడ్లను అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.













