అమరావతి నిర్మాణానికి రూ. 5 లక్షలు విరాళం అందజేసిన గడ్డం భద్రమ్మ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 5 లక్షలు చెక్కును విరాళంగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన శ్రీమతి గడ్డం భద్రమ్మ అందజేశారు. గడ్డం భద్రమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి విరాళాన్ని అందజేశారు.
రాష్ట్ర విభజన అనంతరం రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో కొత్త రాజధాని అమరావతికి వచ్చి అనేక ఒడుదుడుకుల మధ్య సైతం… రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి తన వంతు సహకారాన్ని అందించాలనే ఉద్ధేశ్యంతో తన భర్త లేటు సీతారామయ్య పేరున ఈ విరాళం అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలనోర్చి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముఖ్యమంత్రికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నానని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రికి తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన శ్రీమతి భద్రమ్మను అభినందించి, శాలువతో ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు.













